Friday, July 3, 2009

జూన్ తెలుగు సాహితి సమావేశ నివేదిక

జూన్ 25 న జరిగిన తెలుగు సాహితి సమావేశ వివరాలు:

మే నెల కన్నా జూన్ లో కొంత బాగానే సభ్యులు హాజరు అయ్యారు. అయితే, పని ఒత్తిడి వల్ల చాలా మంది రాలేకపోయారు. అలా రాలేని వారికోసమై మన సమావేశ నివేదిక పంపడం జరుగుతోంది.

జూన్ 25వ తారీకున మధ్యాహ్నం తెలుగు సాహితి సమావేశం మొదలైంది.

మొదటగా శిరీష సమావేశ సూచికను వివరించి, ఏ ఏ అంశాలు ముందుకు వస్తున్నాయో చెప్పడం జరిగింది.

కార్యక్రమాల్లో మొట్టమొదటగా దివాకర్ గారిచే అన్నమయ్య గాన లహరి లో భాగం గా "ముద్దు గారే యశోద ముంగిటి ముత్యము వీడు" అనే అన్నమాచార్య కీర్తనను పాడడం జరిగింది. కీర్తనని పాడిన తరువాత దివాకర్ గారు అన్నమయ్య కీర్తనల గురించి చెబుతూ, ప్రస్తుత కీర్తనలో అన్నమాచార్యుల వారు ఆ వెంకటేశ్వర స్వామిని నవ రత్నాలతో ఏ విధముగా పోల్చినదీ తెలియజెప్పారు. క్రింద ఉదహరించిన అన్నమాచార్య సంకీర్తనల బ్లాగు కూడా అంతర్జాలం నుండీ అందరికీ చూపడం కూడా జరిగింది. ఈ బ్లాగులో అన్నమాచార్య పదాల సాహిత్యమే కాక ప్రసిధ్ధ కళాకారులు ఆలపించిన పాటలు కూడా పొందు పరిచి ఉన్నాయని, అప్పుడప్పుడూ ఆ బ్లాగులో కొత్త గీతాలను చేర్చడం జరుగుతోందని కూడా సభ్యులకు వివరించడమైనది.

అన్నమాచార్య సంకీర్తనల బ్లాగు:

http://annamacharya-lyrics.blogspot.com/

ఆహూతుల్లొ కొందరు, కేవలం అన్నమాచార్య కీర్తనలే కాకుండా ఇతర వాగ్గేయకారుల కీర్తనల్ని కూడా తెలుగు సాహితి సమావేశాల్లో పాడాలని సూచించారు. వారి సూచనని తెలుగు సాహితి నిర్వాహకులు అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది

ఆ నాటి ప్రతేక అతిథి, శ్రీయుతులు తాడిగడప శ్యామలరావు గారు తెలుగు పద్యరీతుల గురించి అహుతులకు వివరించారు. పద్య రీతులు ఎన్ని రకాలు, సంస్కృత పద్యాలు తెలుగు లోకి ఎలా దిగుమతి అయ్యాయి, అచ్చ తెలుగు పద్య రీతుల లక్షణాలు, అనేక రకాల పద్యాల ప్రాముఖ్యత, నడక, నడత, చాలా సులభమైన రీతిలో అందరికీ వివరించారు. ద్విపద, కందము, సీసము, ఆటవెలది, తేటగీతి - ఇలా రక రకాల పద్యాల గురించి ఉదాహరణలతో, వివరంగా చెప్పారు. పై నెల నుంచీ ప్రతీ సమావేశంలో ఆయన తెలుగు పద్య రీతులు ఒక్కొక్కంటిని ఒక్కో సమావేశంలో అందరికీ పరిచయం చేస్తానని సభకి తెలపడం జరిగింది. మున్ముందు జరగబోయే సమవేశాల్లో, ఆయన రాస్తున్న పద్యాలని కూడా అందరికీ వినిపిస్తానని తెలపడం జరిగింది. ప్రతీ నెలా ఈ పద్య పర్వాన్ని మన కర్ణ పర్వంగా అందరమూ వినాలని తెలుగు సాహితి ఆశిస్తోంది.

భగవద్గీతలో కొత్త తరానికి పనికివచ్చే అనేక యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ వంకదారి సోమశేఖర్ గారు ప్రసంగించారు. ఆయన ఒక బృందంగా మనం పని చేస్తున్నపుడు ఆ బృంద నాయకుడు ఎలా ఉండాలి, ఆ బృంద సభ్యులు ఎలా ఉండాలి అన్న విషయాలను సూచిస్తున్న - 3 వ అధ్యాయం లోని 12, 13 శ్లోకాల తాత్పర్యాన్ని వర్తమాన యాజమాన్య రీతులకు అన్వయించి వ్యాఖ్యానాన్ని తెలిపారు. వచ్చే సమావేశాల్లో కూడా ఇలాటి శ్లోకాలని వివరించగలనని తెలపడం జరిగింది.

తరువాత శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు రచించిన "రుద్రమ దేవి" అనే చారిత్రిక నవలా సమీక్ష జరిగింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే ఆంధ్ర దేశాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏలిన తెలుగు సామ్రాఙ్ఞి రుద్రమ దేవి కాలం నాటి పరిస్థితులు, పాలనలో రుద్రమ కు కలిగిన ఇబ్బందులు, విద్రోహులని ఆమె ఎదుర్కున్న వైనం అన్నీ ఎంతో హృద్యంగా వివరించిన నవల, నవల చదివినంత సేపూ మనమొక నాటకాన్ని చూస్తున్నట్లు అనుభూతి చెందే విధం గా రచించబడ్డ నవల అని తెలపడం జరిగింది. క్రింది లంకెలో, పుస్తక నామం ఎదురుగా "రుద్రమ" అని ఇచ్చి వెతికితే ఈ పుస్తకం అంతర్జాల గ్రంధాలయంలో చదవడానికి లభ్యంగా ఉందని కూడా తెలపడం జరిగింది.

అంతర్జాల భారతీయ గ్రంధాలయం :

http://www.new.dli.ernet.in/

పై గ్రంధాలయంలో అనేక తెలుగు పుస్తకాలు ఉన్నాయి. పుస్తక నామం వారీగా, రచయితా వారీగా ఎలా కావాలంటే అలా మనం వెతుక్కోవచ్చు.

బ్లాగుల గురించి ఆసక్తి
ఉన్నసభ్యులు కొందరు బ్లాగులన్నీ ఒకచోట చూసే వీలున్న అంతర్జాల చిరునామాలు అడిగారు. క్రింది లంకెలలో బ్లాగు టపాలు ప్రచురించబడతాయి. మనకు నచ్చిన బ్లాగు టపా పైన నొక్కితే పూర్తీ టపా చదవ గలుగుతాము


http://www.jalleda.com/ http://koodali.org

మీ అందరి సహకారంతో ఐ.బి.యం తెలుగు సాహితి మరిన్ని కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నాము. మీరు కానీ, మీ మిత్రులు గానీ ఏమైనా అంశాల్ని తెలుగు సాహితి సమావేశాల్లో ప్రదర్శించాలనుకుంటే, తెలుగు సాహితి నిర్వాహకులని ఎవరినైనా సంప్రదించవచ్చు. మీకు వచ్చింది ఏదైనా -- ఒక పద్యం, ఒక సామెత, ఒక పొడుపు కధ, ఒక చమత్కార బాణం, ఒక హాస్యపు జల్లు, ఒక మధుర మైన పాట, ఒక పుస్తకం పై సమీక్ష, ఒక మంచి విషయం పై ప్రసంగం - ఇలా ఎన్నైనా సరే, చెప్పుకుంటూ పోవచ్చు. కానీ అన్నిటికీ ఒకేఒక్క నిబంధన. అన్నీ మన తెలుగు భాషలో మాత్రమే సుమా !!

మీరంతా సరదా సమాలోచనల సాహితీ సమావేశాలకి మీ వంతు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ -
మీ
తెలుగు సాహితి


గమనిక : ఆగష్టు లో మన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతేక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని మా ఆలోచన. మీ సలహాలు సూచనలు జూలై నెల సమావేశంలో అందిస్తే, అందరికీ అమోదయోగ్యమైన కార్యక్రమాలని రూపొందించడానికి మాకు అవకాశం ఉంటుంది. మరి మీ అమూల్యమైన అభిప్రాయాలని సిధ్ధం చేసుకుంటారుగా!!!

Monday, February 23, 2009

తెలుగు సాహితి రెండవ సమావేశ నివేదిక

ఫిబ్రవరి 19, 2009 న జరిగిన మన తెలుగు సాహితి రెండవ సమావేశ నివేదిక:


దీన్ని మన బ్లాగ్ http://ibmtelugusaahiti.blogspot.com లో కూడా చూడగలరు


మొదటగా, విజయ శిరీష సమావేశ సూచికని వివరించిన అనంతరం దివాకర్ గారు రమ్యమైన త్యాగరాజ కృతి "నాద సుధా..." పాడి వినిపించి, ఆహుతులను అలరించారు.


తరువాత కొనకంచి సుస్మిత www.maganti.org అనే వెబ్ సైటు ని అందరికీ పరిచయం చెయ్యడం జరిగింది. ఆ సైటు లో ఉన్న అనేక అంశాలను సభ్యులు ఆద్యంతం ఆసక్తిగా చూసి, వారి హర్షాన్ని వెలిబుచ్చడం జరిగింది. పొడుపు కధలు, యక్ష ప్రశ్నలు ఆసాంతం అందరూ చదివి ఆనందించారు.


ఇక రవిగారు తన స్వీయ కవితను అందరికీ వినిపించారు. భావ స్ఫోరకమైన ఆ ప్రేమ కవిత అందరూ ఆస్వాదించి, ప్రశంసించారు.


సం. వెం. రమేష్ గారు వ్రాసిన - "ప్రళయ కావేరి కధలు" అనే కధా సంకలనం సమీక్ష విజయ శిరీష సమర్పించడం జరిగింది. ఆ కధా సంకలనం మరియు సం.వెం. రమేష్ గారు తెలుగు జాతి మూలాల గురించి వ్రాసిన ఇతర వ్యాసాలు క్రింది లంకె లో చూడగలరు:
http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=CV_RAMESH




వంకదారి సోమశేఖర్ గారు - "భగవద్గీత - యాజమాన్య పధ్ధతులు" అనే విషయం పై ప్రసంగించారు. ఒక నాయకునికి ఉండాల్సిన "స్థిత ప్రజ్ఞత" లక్షణాలని ఆయన శ్లోకాలతో సోదాహరణంగా వివరించడం జరిగింది.


తరువాత కిషొర్ గుమ్మరాజు గారు నంది తిమ్మన గారి "పారిజాతాపహరణం నుంచీ" పద్యాల్ని తీసుకుని, పఠించారు. ఆ పద్యాల అర్ధాన్ని కూడా వివరించారు. ఆ తరువాత శ్రీపతి సనత్ కుమార్ గారు "దాశరధీ శతకం" నుంచీ ఎంపిక చేసిన 3 పద్యాలని పఠించారు.


చాలమందికి తెలుగులో బ్లాగుల సమాహారిణుల గురించి తెలియదని చెప్పారు. వారికోసం క్రింది లంకెలని నివేదికలో పొందు పరచడం జరిగింది.


www.jalleda.com


http://www.koodali.org/




వచ్చే ఉగాది సమావేశాలు ఘనంగా చేయ్యాలని, పెద్ద ఎత్తున దానికి ఏర్పాట్లు చెయ్యలని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్య నిర్వాహక సభ్యులుగా ఉండేందుకు ఈ క్రింది వారు ముందుకు వచ్చారు.
శివలెంక శశిరేఖ

రవి మద్దిపూడి

కిషొర్ గుమ్మరాజు

శ్రీనివాస్ మాలె

వంకదారి సోమశేఖర్



వీరు కాక మరెవరైనా ముందుకు రాదలిస్తే, విజయ శిరీష ను కానీ, మల్లిక్ కోవూరి ని గాని సంప్రదించాల్సింది గా మనవి చేయడం జరిగింది.


సభ్యులు కొందరు ఉగాది సంబరాలకి కొన్ని సూచనలు ఇచ్చారు. కానీ కొంత సమయం కావాలని మరి కొందరు చెప్పారు. అందువల్ల సభ్యులందరినీ వచ్చే గురువారం లోపల (అంటే 26వ తారీఖు లోగా) తమ సూచనలని విజయ శిరీష కి అందించవలసినదిగా విజ్ఞప్తి చెయ్యడమైనది.


ఈ సారి మరింత మంది పాల్గొంటారని ఆశిస్తూ, మన తెలుగు సాహితి దిన దినాభివృధ్ధి చెంది, మన తల్లి బాస నిలిపేందుకు మనమంతా ఒక్క తాటిపై నిలబడి, మన అమ్మ బాస లోని కమ్మదనాన్ని అందరమూ ఆస్వాదించాలని కోరుకుంటూ, ఉగాది సంబరాల కై మీ సహాయ సహకారాలు అందరూ అందిస్తారని ఆశిస్తూ, ఈ సారి ఉగాది పండుగ తెలుగు దనాన్ని మేళవించి పెద్ద ఎత్తున చేయడానికి మీ అందరూ మీ అమూల్యమైన సలహాలని, సూచనలని అందిస్తారని అభిలషిస్తూ --


మీ తెలుగు సాహితి




కొస మెరుపు: తెలుగు సాహితి లో పరిచయం చెయ్యబడ్డ అచ్చ తెనుగు వెబ్ సైటు www.maganti.org వెనుక ఉన్న కృషీవలుడు మాగంటి వంశీ మోహన్ మన ఐ.బి.యం కి చెందినవారు అని ముళ్ళపుడి సత్య గారు తెలియజేసారు. మన తెలుగు సాహితి జాబితా లో వారి పేరు కూడా నమోదు చేసుకున్నాను. కార్యక్రమాల వివరాలన్నీ ఇక వారికి కూడా అందుతాయి. వంశీ గారి మైల్ ఐడి vmaganti@us.ibm.com వీరిని మన అంతర్గత సంభాషిణి (same time) ద్వారా లేక ఉత్తరం (mail) ద్వారా నైనా సులభం గా సంప్రదించవచ్చు.




వంశీ గారూ, తెలుగు సాహితి కి స్వాగతం :-)

Friday, January 9, 2009

తొలి సమావేశ నివేదిక

ది. జనవరి 08, 2009 నాడు ఐ.బి.యం. హైదరాబాదు నగర శాఖలో, వారి సంస్థాగత సాహితీ సమితి - "తెలుగు సాహితి" తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశ నివేదికని క్రింద పొందు పరుస్తున్నాను.
విజయ శిరీష సమావేశ సూచికను వివరించిన అనంతరం, మొదటగా, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన "చక్కెర కలిపిన తీయ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు" అనే ప్రారంభ గీతాన్ని శ్రీ దివాకర్ గారు ఎంతో హృద్యంగా ఆలపించి ఆహుతులందరినీ అలరింపజేసారు.
తరువాత కోవూరి మల్లిక్ గారు, తెలుగు సాహితి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం ఎలా కలిగిందీ, దాని నేపధ్యాన్ని వివరించి, తమదైన శైలిలో ఒక చిన్ని కవితను అందరికీ వినిపించారు
తదనంతరం విజయ శిరీష, 3 తెలుగు వెబ్ సైటుల సమీక్ష సమర్పించడం జరిగింది. వాటి వివరాలు:
http://www.andhrabharati.com
http://www.teluguone.com/kathaluNovels/
http://teluguthesis.com
అంతర్జాలంలో తెలుగు వ్రాయుటకు ఉపయుక్తమైన http://www.lekhini.org వాడుకని కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది.
తెలుగు సాహితి సమావేశ నివేదికను తెలుగు సాహితి వివరాలతో మొదలుపెట్టిన తెలుగు బ్లాగులో ప్రచురించాలని, నివేదికలే కాక తెలుగు సాహితి కి సంబంధించిన మరే అంశాన్నైనా కూడా ఆ బ్లాగులోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పొందు పరచాలని నిర్ణయించడం జరిగింది.
మాలే శ్రీనివాస్ గారు శ్రీ ముద్దుకృష్ణ గారిచే సంకలనం చేయబడ్డ "వైతాళికులు" అనే కవితా సంకలన గ్రంధం గురించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఆ పుస్తకం కావలసిన వారు హైదరాబాదు కోఠీ లోని విశాలాంధ్ర పబ్లికేషన్సు వారిని సంప్రదించాలని సూచించారు.
మద్దిపూడి రవి కుమార్ గారు చాలా అందంగా సులభ శైలిలో నిరుద్యోగంపై వ్రాసిన స్వీయ కవితని అందరికీ చదివి వినిపించారు. నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న ఆ కవితను అందరూ విని, ఆస్వాదించి, వారిని అభినందించడం జరిగింది.
ముందుగా చెప్పకున్నా, తనకు తానే స్వంతంగా గుమ్మరాజు కిషోర్ కుమార్ గారు - నన్నయామాత్య ప్రణీత ఆంధ్ర మహాభారతం సభా పర్వం నుండీ, ద్రౌపదీ మాన సంరక్షణ ఘట్టంలో భీముడు పద్య రూపంలో చేసిన ప్రతిఙ్ఞలని గానం చేసి వినిపించారు. అంతే కాకుండా ప్రతీ సమావేశంలో కనీసం రెండు పద్యాలనైనా వినిపించడానికి తమ సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది.
తరువాత తెలుగు సాహితి కార్యకలాపాలపై చర్చ జరిగింది. సభ్యుల సూచనలని స్వీకరించడం జరిగింది. మన పండుగల ప్రాశస్త్యాన్ని సందర్భానుసారం వివరించాల్సిందని గుమ్మరాజు కిషోర్ కుమార్ గారు సూచించగా, భగవత్గీత మరియు మన ప్రాచీన గ్రంధాలలో నేటి జీవన శైలికి పనికి వచ్చే అంశాలని అందరి ముందుకూ తేవాలని వంకదారి సోమ శేఖర్ గారు ప్రతిపాదించగా, కరుణశ్రీ గారు వారితో పాటు అలాటి విషయాలపై తమ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. అందరికీ అనువుగా ఉండే విధంగా ప్రతి నెలలోని రెండవ గురువారం తెలుగు సాహితి సమావేశం ఏర్పాటు చెయ్యాలని, అందులో కనీసం 3 అంశాలకు తగ్గకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
అంతలో శ్రీయుతులు పెద్ది శ్రీనివాస్ రావు గారు విచ్చేసి, తెలుగు సాహితి కార్యక్రమంలో పాల్గొని, సభ్యులందరినీ ప్రోత్సహించారు. ఎన్నో కార్య భారాల్లో నిమగ్నులై ఉన్నప్పటికీ వారు ఈ సమావేశానికి రావడం, అందరితో తెలుగులో మాట్లాడడం తో పాటు ఇలాటి కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడంతో సమావేశానికి ఒక కొత్త బలం చేకూరినట్లు అయ్యింది. శ్రీనివాస్ గారితో పాటుగా వచ్చిన సురేష్ కుమార్ గారు తమ మాటలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. శ్రీనివాస్ గారి సమక్షంలో రవిగారు తన కవిత మళ్ళీ వినిపించగా, సినారె గారి పద్యాన్ని కిషోర్ గారు ఉటంకించారు.
చివరగా మల్లిక్ గారు మాట్లాడుతూ, సంక్రాంతి పడుగ త్వరలోనే రాబొతోంది కానీ మళ్ళీ ఇంత స్వల్ప వ్యవధిలో సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడం వీలు కాదు కనుక తమకి వీలైన పద్యాన్నో, కవితనో మరేదైనా అంశాన్నో సభ్యులు విజయ శిరీషకి పంపినట్లైతే, వాటన్నిటినీ ఒక్కచోట చేర్చి ప్రచురించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంతగా స్పందించి సమావేశానికి వచ్చిన వారికి, తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది శ్రీనివాస్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ, మల్లిక్ గారు చేసిన వందన సమర్పణతో తెలుగు సాహితి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
బ్లాగులు మొదలుపెట్టాలనుకునే ఔత్సాహికులకు కింది లంకెల్లో సమాచారం దొరుకుతుంది.
http://computerera.co.in/chat
ఈ బ్లాగులో సాంకేతిక సమాచారం అంతా పొందు పరచి ఉంది. సాంకేతిక పరంగా సందేహాలు ఉన్నవారికి ఇది చాలా పనికి వస్తుంది
http://computerera.co.in/blog
 

King Size Direct Promotion Code
King Size Direct Promotion Code