Friday, July 3, 2009

జూన్ తెలుగు సాహితి సమావేశ నివేదిక

జూన్ 25 న జరిగిన తెలుగు సాహితి సమావేశ వివరాలు:

మే నెల కన్నా జూన్ లో కొంత బాగానే సభ్యులు హాజరు అయ్యారు. అయితే, పని ఒత్తిడి వల్ల చాలా మంది రాలేకపోయారు. అలా రాలేని వారికోసమై మన సమావేశ నివేదిక పంపడం జరుగుతోంది.

జూన్ 25వ తారీకున మధ్యాహ్నం తెలుగు సాహితి సమావేశం మొదలైంది.

మొదటగా శిరీష సమావేశ సూచికను వివరించి, ఏ ఏ అంశాలు ముందుకు వస్తున్నాయో చెప్పడం జరిగింది.

కార్యక్రమాల్లో మొట్టమొదటగా దివాకర్ గారిచే అన్నమయ్య గాన లహరి లో భాగం గా "ముద్దు గారే యశోద ముంగిటి ముత్యము వీడు" అనే అన్నమాచార్య కీర్తనను పాడడం జరిగింది. కీర్తనని పాడిన తరువాత దివాకర్ గారు అన్నమయ్య కీర్తనల గురించి చెబుతూ, ప్రస్తుత కీర్తనలో అన్నమాచార్యుల వారు ఆ వెంకటేశ్వర స్వామిని నవ రత్నాలతో ఏ విధముగా పోల్చినదీ తెలియజెప్పారు. క్రింద ఉదహరించిన అన్నమాచార్య సంకీర్తనల బ్లాగు కూడా అంతర్జాలం నుండీ అందరికీ చూపడం కూడా జరిగింది. ఈ బ్లాగులో అన్నమాచార్య పదాల సాహిత్యమే కాక ప్రసిధ్ధ కళాకారులు ఆలపించిన పాటలు కూడా పొందు పరిచి ఉన్నాయని, అప్పుడప్పుడూ ఆ బ్లాగులో కొత్త గీతాలను చేర్చడం జరుగుతోందని కూడా సభ్యులకు వివరించడమైనది.

అన్నమాచార్య సంకీర్తనల బ్లాగు:

http://annamacharya-lyrics.blogspot.com/

ఆహూతుల్లొ కొందరు, కేవలం అన్నమాచార్య కీర్తనలే కాకుండా ఇతర వాగ్గేయకారుల కీర్తనల్ని కూడా తెలుగు సాహితి సమావేశాల్లో పాడాలని సూచించారు. వారి సూచనని తెలుగు సాహితి నిర్వాహకులు అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది

ఆ నాటి ప్రతేక అతిథి, శ్రీయుతులు తాడిగడప శ్యామలరావు గారు తెలుగు పద్యరీతుల గురించి అహుతులకు వివరించారు. పద్య రీతులు ఎన్ని రకాలు, సంస్కృత పద్యాలు తెలుగు లోకి ఎలా దిగుమతి అయ్యాయి, అచ్చ తెలుగు పద్య రీతుల లక్షణాలు, అనేక రకాల పద్యాల ప్రాముఖ్యత, నడక, నడత, చాలా సులభమైన రీతిలో అందరికీ వివరించారు. ద్విపద, కందము, సీసము, ఆటవెలది, తేటగీతి - ఇలా రక రకాల పద్యాల గురించి ఉదాహరణలతో, వివరంగా చెప్పారు. పై నెల నుంచీ ప్రతీ సమావేశంలో ఆయన తెలుగు పద్య రీతులు ఒక్కొక్కంటిని ఒక్కో సమావేశంలో అందరికీ పరిచయం చేస్తానని సభకి తెలపడం జరిగింది. మున్ముందు జరగబోయే సమవేశాల్లో, ఆయన రాస్తున్న పద్యాలని కూడా అందరికీ వినిపిస్తానని తెలపడం జరిగింది. ప్రతీ నెలా ఈ పద్య పర్వాన్ని మన కర్ణ పర్వంగా అందరమూ వినాలని తెలుగు సాహితి ఆశిస్తోంది.

భగవద్గీతలో కొత్త తరానికి పనికివచ్చే అనేక యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ వంకదారి సోమశేఖర్ గారు ప్రసంగించారు. ఆయన ఒక బృందంగా మనం పని చేస్తున్నపుడు ఆ బృంద నాయకుడు ఎలా ఉండాలి, ఆ బృంద సభ్యులు ఎలా ఉండాలి అన్న విషయాలను సూచిస్తున్న - 3 వ అధ్యాయం లోని 12, 13 శ్లోకాల తాత్పర్యాన్ని వర్తమాన యాజమాన్య రీతులకు అన్వయించి వ్యాఖ్యానాన్ని తెలిపారు. వచ్చే సమావేశాల్లో కూడా ఇలాటి శ్లోకాలని వివరించగలనని తెలపడం జరిగింది.

తరువాత శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు రచించిన "రుద్రమ దేవి" అనే చారిత్రిక నవలా సమీక్ష జరిగింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే ఆంధ్ర దేశాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏలిన తెలుగు సామ్రాఙ్ఞి రుద్రమ దేవి కాలం నాటి పరిస్థితులు, పాలనలో రుద్రమ కు కలిగిన ఇబ్బందులు, విద్రోహులని ఆమె ఎదుర్కున్న వైనం అన్నీ ఎంతో హృద్యంగా వివరించిన నవల, నవల చదివినంత సేపూ మనమొక నాటకాన్ని చూస్తున్నట్లు అనుభూతి చెందే విధం గా రచించబడ్డ నవల అని తెలపడం జరిగింది. క్రింది లంకెలో, పుస్తక నామం ఎదురుగా "రుద్రమ" అని ఇచ్చి వెతికితే ఈ పుస్తకం అంతర్జాల గ్రంధాలయంలో చదవడానికి లభ్యంగా ఉందని కూడా తెలపడం జరిగింది.

అంతర్జాల భారతీయ గ్రంధాలయం :

http://www.new.dli.ernet.in/

పై గ్రంధాలయంలో అనేక తెలుగు పుస్తకాలు ఉన్నాయి. పుస్తక నామం వారీగా, రచయితా వారీగా ఎలా కావాలంటే అలా మనం వెతుక్కోవచ్చు.

బ్లాగుల గురించి ఆసక్తి
ఉన్నసభ్యులు కొందరు బ్లాగులన్నీ ఒకచోట చూసే వీలున్న అంతర్జాల చిరునామాలు అడిగారు. క్రింది లంకెలలో బ్లాగు టపాలు ప్రచురించబడతాయి. మనకు నచ్చిన బ్లాగు టపా పైన నొక్కితే పూర్తీ టపా చదవ గలుగుతాము


http://www.jalleda.com/ http://koodali.org

మీ అందరి సహకారంతో ఐ.బి.యం తెలుగు సాహితి మరిన్ని కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నాము. మీరు కానీ, మీ మిత్రులు గానీ ఏమైనా అంశాల్ని తెలుగు సాహితి సమావేశాల్లో ప్రదర్శించాలనుకుంటే, తెలుగు సాహితి నిర్వాహకులని ఎవరినైనా సంప్రదించవచ్చు. మీకు వచ్చింది ఏదైనా -- ఒక పద్యం, ఒక సామెత, ఒక పొడుపు కధ, ఒక చమత్కార బాణం, ఒక హాస్యపు జల్లు, ఒక మధుర మైన పాట, ఒక పుస్తకం పై సమీక్ష, ఒక మంచి విషయం పై ప్రసంగం - ఇలా ఎన్నైనా సరే, చెప్పుకుంటూ పోవచ్చు. కానీ అన్నిటికీ ఒకేఒక్క నిబంధన. అన్నీ మన తెలుగు భాషలో మాత్రమే సుమా !!

మీరంతా సరదా సమాలోచనల సాహితీ సమావేశాలకి మీ వంతు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ -
మీ
తెలుగు సాహితి


గమనిక : ఆగష్టు లో మన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతేక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని మా ఆలోచన. మీ సలహాలు సూచనలు జూలై నెల సమావేశంలో అందిస్తే, అందరికీ అమోదయోగ్యమైన కార్యక్రమాలని రూపొందించడానికి మాకు అవకాశం ఉంటుంది. మరి మీ అమూల్యమైన అభిప్రాయాలని సిధ్ధం చేసుకుంటారుగా!!!
 

King Size Direct Promotion Code
King Size Direct Promotion Code