Friday, January 9, 2009

తొలి సమావేశ నివేదిక

ది. జనవరి 08, 2009 నాడు ఐ.బి.యం. హైదరాబాదు నగర శాఖలో, వారి సంస్థాగత సాహితీ సమితి - "తెలుగు సాహితి" తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశ నివేదికని క్రింద పొందు పరుస్తున్నాను.
విజయ శిరీష సమావేశ సూచికను వివరించిన అనంతరం, మొదటగా, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన "చక్కెర కలిపిన తీయ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు" అనే ప్రారంభ గీతాన్ని శ్రీ దివాకర్ గారు ఎంతో హృద్యంగా ఆలపించి ఆహుతులందరినీ అలరింపజేసారు.
తరువాత కోవూరి మల్లిక్ గారు, తెలుగు సాహితి ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం ఎలా కలిగిందీ, దాని నేపధ్యాన్ని వివరించి, తమదైన శైలిలో ఒక చిన్ని కవితను అందరికీ వినిపించారు
తదనంతరం విజయ శిరీష, 3 తెలుగు వెబ్ సైటుల సమీక్ష సమర్పించడం జరిగింది. వాటి వివరాలు:
http://www.andhrabharati.com
http://www.teluguone.com/kathaluNovels/
http://teluguthesis.com
అంతర్జాలంలో తెలుగు వ్రాయుటకు ఉపయుక్తమైన http://www.lekhini.org వాడుకని కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది.
తెలుగు సాహితి సమావేశ నివేదికను తెలుగు సాహితి వివరాలతో మొదలుపెట్టిన తెలుగు బ్లాగులో ప్రచురించాలని, నివేదికలే కాక తెలుగు సాహితి కి సంబంధించిన మరే అంశాన్నైనా కూడా ఆ బ్లాగులోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పొందు పరచాలని నిర్ణయించడం జరిగింది.
మాలే శ్రీనివాస్ గారు శ్రీ ముద్దుకృష్ణ గారిచే సంకలనం చేయబడ్డ "వైతాళికులు" అనే కవితా సంకలన గ్రంధం గురించి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఆ పుస్తకం కావలసిన వారు హైదరాబాదు కోఠీ లోని విశాలాంధ్ర పబ్లికేషన్సు వారిని సంప్రదించాలని సూచించారు.
మద్దిపూడి రవి కుమార్ గారు చాలా అందంగా సులభ శైలిలో నిరుద్యోగంపై వ్రాసిన స్వీయ కవితని అందరికీ చదివి వినిపించారు. నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న ఆ కవితను అందరూ విని, ఆస్వాదించి, వారిని అభినందించడం జరిగింది.
ముందుగా చెప్పకున్నా, తనకు తానే స్వంతంగా గుమ్మరాజు కిషోర్ కుమార్ గారు - నన్నయామాత్య ప్రణీత ఆంధ్ర మహాభారతం సభా పర్వం నుండీ, ద్రౌపదీ మాన సంరక్షణ ఘట్టంలో భీముడు పద్య రూపంలో చేసిన ప్రతిఙ్ఞలని గానం చేసి వినిపించారు. అంతే కాకుండా ప్రతీ సమావేశంలో కనీసం రెండు పద్యాలనైనా వినిపించడానికి తమ సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది.
తరువాత తెలుగు సాహితి కార్యకలాపాలపై చర్చ జరిగింది. సభ్యుల సూచనలని స్వీకరించడం జరిగింది. మన పండుగల ప్రాశస్త్యాన్ని సందర్భానుసారం వివరించాల్సిందని గుమ్మరాజు కిషోర్ కుమార్ గారు సూచించగా, భగవత్గీత మరియు మన ప్రాచీన గ్రంధాలలో నేటి జీవన శైలికి పనికి వచ్చే అంశాలని అందరి ముందుకూ తేవాలని వంకదారి సోమ శేఖర్ గారు ప్రతిపాదించగా, కరుణశ్రీ గారు వారితో పాటు అలాటి విషయాలపై తమ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. అందరికీ అనువుగా ఉండే విధంగా ప్రతి నెలలోని రెండవ గురువారం తెలుగు సాహితి సమావేశం ఏర్పాటు చెయ్యాలని, అందులో కనీసం 3 అంశాలకు తగ్గకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
అంతలో శ్రీయుతులు పెద్ది శ్రీనివాస్ రావు గారు విచ్చేసి, తెలుగు సాహితి కార్యక్రమంలో పాల్గొని, సభ్యులందరినీ ప్రోత్సహించారు. ఎన్నో కార్య భారాల్లో నిమగ్నులై ఉన్నప్పటికీ వారు ఈ సమావేశానికి రావడం, అందరితో తెలుగులో మాట్లాడడం తో పాటు ఇలాటి కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడంతో సమావేశానికి ఒక కొత్త బలం చేకూరినట్లు అయ్యింది. శ్రీనివాస్ గారితో పాటుగా వచ్చిన సురేష్ కుమార్ గారు తమ మాటలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. శ్రీనివాస్ గారి సమక్షంలో రవిగారు తన కవిత మళ్ళీ వినిపించగా, సినారె గారి పద్యాన్ని కిషోర్ గారు ఉటంకించారు.
చివరగా మల్లిక్ గారు మాట్లాడుతూ, సంక్రాంతి పడుగ త్వరలోనే రాబొతోంది కానీ మళ్ళీ ఇంత స్వల్ప వ్యవధిలో సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడం వీలు కాదు కనుక తమకి వీలైన పద్యాన్నో, కవితనో మరేదైనా అంశాన్నో సభ్యులు విజయ శిరీషకి పంపినట్లైతే, వాటన్నిటినీ ఒక్కచోట చేర్చి ప్రచురించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంతగా స్పందించి సమావేశానికి వచ్చిన వారికి, తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది శ్రీనివాస్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ, మల్లిక్ గారు చేసిన వందన సమర్పణతో తెలుగు సాహితి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
బ్లాగులు మొదలుపెట్టాలనుకునే ఔత్సాహికులకు కింది లంకెల్లో సమాచారం దొరుకుతుంది.
http://computerera.co.in/chat
ఈ బ్లాగులో సాంకేతిక సమాచారం అంతా పొందు పరచి ఉంది. సాంకేతిక పరంగా సందేహాలు ఉన్నవారికి ఇది చాలా పనికి వస్తుంది
http://computerera.co.in/blog

1 comment:

  1. సమావేశ నివేదిక ద్వారా ఐ.బి.ఎం. ఉద్యోగస్తుల, తెలుగు సాహిత్యం పై కల ఆసక్తి తెలుస్తూంది. తెలుగు బ్లాగులు చదివి, ఎవరైనా తెలుగులో కొత్త బ్లాగు ప్రారంభించడానికి ఉత్సాహం చూపారా? మీ ప్రణాళిక ప్రకారం ఈ నెల 12 న జరగబోయే సమావేశం విజయవంతం కావాలని అభిలషిస్తున్నాను. కొత్త బ్లాగు ప్రారంభించటానికి ఏమైనా సహాయం కావాలంటే తెలుగు బ్లాగు గుంపు ను సంప్రదింపవచ్చు.
    cbrao
    http://deeptidhaara.blogspot.com/

    ReplyDelete

 

King Size Direct Promotion Code
King Size Direct Promotion Code